Wednesday, 25 November 2026 01:24:55 PM
Font:
Home » కంచే చేను మేసిందా?..కాపలా కాయాల్సిన అధికారే.. లంచం బేరానికి దిగాడా?
తెలంగాణ (Telangana)

కంచే చేను మేసిందా?..కాపలా కాయాల్సిన అధికారే.. లంచం బేరానికి దిగాడా?

✍️ admin • 📅 25 Nov 2026, 12:28 PM • 🕒 57 mins ago • 19 Views

కంచే చేను మేసిందా?..కాపలా కాయాల్సిన అధికారే.. లంచం బేరానికి దిగాడా? కేసు నీరుగార్చేందుకు రూ.30 లక్షల డిమాండ్.. ఏసీబీ అధికారిపై ఫిర్యాదు… హైదరాబాద్: అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన ఏసీబీ విభాగంలోనే ఓ దర్యాప్తు అధికారిపై లంచం డిమాండ్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసి, డబ్బులు ఇస్తే కేసును నీరుగార్చేలా చేస్తానని చెప్పినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలో విద్యుత్తు పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారిపై గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు, తన కేసును పర్యవేక్షిస్తున్న దర్యాప్తు అధికారి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో నిందితుడు జైలులో ఉన్న సమయంలో ఓ కాంట్రాక్టర్ అతడిని ములాఖత్‌లో కలిశాడు. కేసును పర్యవేక్షిస్తున్న అధికారితో తనకు పరిచయం ఉందని, డబ్బులు ఇస్తే కేసును మూసివేయించేందుకు సహకరిస్తానని చెప్పినట్లు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ ఫోన్ ద్వారా ఇదే విషయంపై సంప్రదించినట్లు తెలుస్తోంది. నిందితుడు బెయిల్ షరతులకు సంబంధించి గత ఏడాది డిసెంబరులో ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో, దర్యాప్తు బృందంలోని కీలక అధికారి సూచన మేరకు కేసు దర్యాప్తు అధికారి అతడితో బేరసారాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.30 లక్షలతో కేసు మాయం చేస్తానన్నారా? ఈ కేసులో నిందితుడికి బినామీగా అదే హోదాకు చెందిన మరో అధికారిని చేర్చినట్లు సమాచారం. అయితే సరైన ఆధారాలు లేవన్న కారణంతో ఆ అధికారిని కేసు నుంచి తొలగించాలని ఏసీబీ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని దర్యాప్తు అధికారి నిందితుడిని మభ్యపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ నేపథ్యంలో, అధికారిక మార్గాల ద్వారా ఆదాయం సమకూరినట్లు రికార్డులను మార్చేలా చేస్తానని చెప్పి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నిందితుడు ఈ వ్యవహారంపై ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అవినీతిని అరికట్టేందుకు పనిచేసే సంస్థలోనే ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.